యాతగిరి శ్రీరామ నరసింహారావు
యాతగిరి శ్రీరామ నరసింహారావు) | |
---|---|
జననం | యాతగిరి శ్రీరామ నరసింహారావు 18 అక్టోబర్ 1936 తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం |
మరణం | 17- 05- 2022 రాజమండ్రి |
మరణ కారణం | వృద్ధాప్యం |
తల్లిదండ్రులు |
|
యాతగిరి శ్రీరామ నరసింహారావు [{18.10.1936 - 17.05.2022}] చారిత్రక పరిశోధకులు. ఆయన రాజమండ్రిని రాజమహేంద్రిగా సంభావించేవిధంగా నగర సాంంస్కృతిక వైభవాన్ని చాటుతూ, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు కృషి చేసారు. చారిత్రక పరిశోధకులుగా ఎన్నో అంశాలు వెలుగులోకి తీసుకువచ్చిన ఘనత ఈయనది. అందుకే "రాజమహేంద్రి తనను తాను అద్దంలో చూసుకుంటే కనిపించేది శ్రీ వై.ఎస్.నరసింహారావే. నిజమైన కార్యదక్షుడు శ్రీ వై.ఎస్.ఎన్" అని ఆంధ్రకేసరి యువజనసమితి మాజీ అధ్యక్షులు, నరసాపురం వైఎన్ కళాశాల రిటైర్డ్ రీడర్ డాక్టర్ అరిపిరాల నారాయణరావు అన్నారు.
జననం - వంశం
[మార్చు]ఆయన తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో అమ్మమ్మ అప్పలి సుభద్రమ్మకు చెందిన మామిడితోటలో కట్టుకున్న కొత్త ఇంట్లో 1936 అక్టోబరు 18న జన్మించిన శ్రీరామ నరసింహారావు రాజమహేంద్రి స్వస్థ్లలం అయింది.మధ్వ సంప్రదాయానికి చెందిన ఈయన తండ్రి వెంకట నరసింహారావు.తల్లి రామాబాయమ్మ. శ్రీరామ నరసింహారావు తాత గారు యాతగిరి పూర్ణయ్య పంతులు.ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు - పూర్ణయ్య పంతులు వీరిద్దరూ నాటక రంగ సహచరులు. వై.ఎస్.నరసింహారావుకి కుమార్తెలు రమాదేవి-రమణి.అల్లుళ్ళు ధర్మపురి శేషగిరిరావు-దామోజీపురపు కృష్ణమోహన్.కొడుకు యాతగిరి రవితేజ-కోడలు ఉష
ఆంధ్రకేసరి యువజన సమితి స్థాపన
[మార్చు]సహకారశాఖలో ఉద్యోగంచేసిన యాతగిరి శ్రీరామ నరసింహారావు 1962లో ఆంధ్రకేసరి యువజన సమితి ప్రారంభించారు. టంగుటూరి ప్రకాశం పంతులు గారంటే అమితంగా ఇష్టపడే నరసింహారావు ఆయన పేరుతోనే సమితిని నెలకొల్పారు.ఎన్నో సేవాకార్యక్రమాలకు సమితి వేదిక అయింది. కుష్టువ్యాధి నివారణ పధకాన్ని 10 ఏళ్ళపాటు నిర్వహించిన సమితి సాంస్కృతిక వికాసానికి, విద్యాబివృద్దికి, సాంస్కృతిక పరిరక్షణకు కృషిచేస్తూ వచ్చింది. ఇందుకోసం ఎన్నో ఉద్యమాలను కూడా నడిపింది. వీటన్నింటికీ యాతగిరి శ్రీరామ నరసింహారావు మార్గనిర్దేశనం చేస్తూ వచ్చారు. 35గ్రామాల్లో ఈపధకాన్ని సమర్ధవంతంగా అమలు చేసినందుకు సమితి సంస్థాపకునిగా న్యూడిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ఆనాటి ప్రధాని ఇందిరాగాంధి నుంచి 1968లో సత్కారం అందుకున్నారు.రాళ్ళబండి సుబ్బారావు మ్యూజియం ప్రభుత్వపరం కావడంలోనూ, సిటీ మున్సిపల్ హైస్కూల్ విషయంలోనూ, గౌతమీ ప్రాంతీయ గ్రంథాలయం తదితర అంశాలలో సమితిని పోరాటదిశగా నడిపించారు.
ఆంధ్రకేసరి విద్యాసంస్థల స్థాపన
[మార్చు]- ఇది చాలా యాదృచ్ఛికంగా జరిగిందనే చెప్పాలి.అప్పటికే సమితి కార్యక్రమాలకు ఊతమిస్తూ వచ్చిన ఆనాటి కేంద్రమంత్రి పి.వి.నరసింహారావు సమితి గౌరవ సభ్యులుగా సభ్యత్వం స్వీకరించారు.అప్పట్లొ జూనియర్ కాలేజీల కొరత వుండడం, వి.టి.కళాశాలలో బిల్డింగ్ ఫండ్ వసూలు చేస్తున్న కారణంగా సమితి ఉద్యమం చేపట్టింది.అప్పుడు ముఖ్యమంత్రిగా వున్న పి.వి., ఆంధ్రకేసరి ప్రకాశం శతజయంతి కార్యక్రమానికి కూడా వచ్చారు.సమితి తరపున కాలేజీ పెట్టమని సూచిస్తూ, కార్పస్ ఫండ్ కట్టక్కర్లేకుండా అనుమతి ఇచ్చారు.దీంతో అప్పటివరకూ సేవా కార్యక్రమాలు, ఉద్యమాలు చేస్తూ వచ్చిన సమితి తరపున కాలేజీ పెట్టించి, దిగ్విజయంగా నడుపుతున్నారు. 1972-73లో ఆంధ్రకేసరి శతజయంత్యత్సవ జునియర్ కళాశాల (ఎకెసి కాలేజీ) ఏర్పడితే, సొంత భవనాలను సమకూర్చుకుంది.ఆనాటి సమితి ప్రెసిడెంట్ ఎం ఎన్ చారి కృషి కీలకం. ఇక 1994 ఆగస్టు23న జూనియర్ కళాశాల పక్కనే డిగ్రీ కళాశాలను కళాప్రపూర్ణ వావిలాల గోపాలకృష్ణయ్య ప్రారంభోత్సవం చేసారు.ఎయిడెడ్ కళాశాలలు ప్రస్తుతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ వైఎస్ఎన్ సమయస్ఫూర్తితో నిరాటంకగా నడుస్తున్నాయి.
రాష్ట్రపతులు-ఫ్రధానులతో అనుబంధం
[మార్చు]అది యాదృచ్ఛికమో ఏమో గానీ ఇంచుమించు చాలామంది రాష్ట్రపతులు, ప్రధానులతొ అనుబంధం యాతగిరి శ్రీరామ నరసింహారావుకి వుండడం విశేషం. భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంధ్రప్రసాద్ 1955లో విజయవాడ మున్సిపల్ హైస్కూల్ లో హిందీ ప్రేమీమండలి ఉత్సవాల్లో మాట్లాడుతుంటే వై.ఎస్.ఎన్. చూసారు. ఇక 1962 సెప్టెంబరు-అక్టోబరు లలో రెండునెలల పాటు జరిగిన సహకార శిక్షణ పొందిన వైఎస్ ఎన్ నాయకత్వంలో ఆనాటి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ని కలుసుకున్నారు. అలాగే 1962లో ఆనాటి ఉప రాష్ట్రపతి శ్రీ జాకీర్ హుస్సేన్ ని ఆయన అధికార నివాసంలో, 1970లో ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ ని రాష్ట్రపతి భవన్ లో కలుసుకున్నారు. అఖిల భారత కుష్టు నివారణ సంఘ్ కార్యవర్గ సమావేశం రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ అధ్యక్షతన 1983 ఆగస్టు 6లో జరగ్గా సమితి పక్షాన హాజరయ్యారు. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, 1957 ఏప్రియల్ లో రాజమండ్రి ట్రావెలర్స్ బంగ్లాకు వచ్చినపుడు భారత్ సేవక్ సమాజ్ పట్టణ కార్యదర్శి హోదాలో కలుసుకుని వినతిపత్రం అందించారు. అలాగే భారత తొలిప్రధాని నెహ్రూ రాజమండ్రి ఎన్నికల ప్రచారానికి 1951డిసెంబరులో వచ్చినపుడు చూసారు.ఇక మాజీ ప్రధాని ఇందిరా గాంంధితో డిల్లీలో సన్మానం అందుకున్నారు. ఇక మాజీ ప్రధాని పి.వి.అయితే సమితి శాశ్వత సభ్యులు కావడంతో అనుబంధం చివరివరకూ కొనసాగింది.
స్వాతంత్ర్య సమరయోధురాండ్ర పార్కు
[మార్చు]ఒకరా ఇద్దరా ఏకంగా 12మంది మహిళా స్వాతంత్ర్య సమరయోధురాండ్ర పార్కుని రాజమండ్రి పాల్ చౌక్ (ఇన్నీసుపేట) లో నెలకొల్పి, విగ్రహాలు ఏర్పాటుచేయించడంలో వై.ఎస్.ఎన్.చూపిన చొరవ అద్వితీయం. శిలాఫలకాలపై మహిళా సమరయోధుల గురించి లిఖించారు. వై.ఎస్.నరసింహారావు 25 సంవత్సరాలపాటు కందుకూరి వీరేశలింగం టౌన్ హాలు ట్రస్ట్ బోర్దు కార్యదర్శిగా సేవలందించారు.టౌన్ హాలు జూబ్లి పబ్లిక్ లైబ్రెరీ అభివృద్ధికి కృషి చేసారు. టౌన్ హాలులో పుస్తక ప్రదర్శనలు నిర్వహించారు.
ఇండియా ఇండిపెండెన్స్ సెంటర్
[మార్చు]అంతేకాదు పార్కుని ఆనుకుని ఇండియా ఇండిపెండెన్స్ సెంటర్ నెలకొల్పిన వైఎస్ఎన్, స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలు, వాడిన వస్తువులు అన్నీ సేకరించి అందులో ఏర్పాటుచేయిస్తున్నారు. ఇంకం టాక్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ మేడిశెట్టి తిరుమలకుమార్ తోకల్సి'మనవావిలాల'పుస్తకం రచించారు. రాజమహేంద్రి నగరానికి సంబంధించి అన్ని విషయాలు క్రోడీకరించి, క్విజ్ మాదిరిగా "నృసింహ ప్రశ్నోపనిషత్" పేరిట 'సమాచారమ్'స్థానిక దినపత్రికలో ధారావాహికంగా అందించిన ప్రశ్నలు-జవాబులు పుస్తక రూపంలోకి తెచ్చారు. ప్రస్తుతం3వముద్రణ అయింది.ఆలాగే యాతగిరి శ్రీరామనరసింహారావు ధారావాహికంగా రాసిన "గుర్తుకొస్తున్నాయి"శీర్షిక ఆతర్వాత"నరసింహావలోకనం" (స్వీయచరిత్ర) పుస్తకంగా రూపుదిద్దుకుంది. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి ఎపి నూతన రాజధాని 2015లో తొలిసారి తుళ్ళూరులో జరిగిన ఉగాది ఉత్సవంలో ప్రభుత్వం నుంచి పురస్కారం అందుకున్నారు.
అశీతి ఉత్సవం
[మార్చు]11వ శతాబ్దంనాటి శ్రీ లక్ష్మినరసింహస్వామి విగ్రహంగల ఉత్తరాదిమఠానికి అధికారిగావున్న యాతగిరి శ్రీరామ నరసింహారావు 80 వ పుట్టినరోజు (అశీతి) సందర్భంగా 2016అక్టోబరు 1శనివారం రాత్రి గోదావరిగట్టు టి.నగర్ శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవాసమితి ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకకు బుద్ధప్రసాద్ ముఖ్య అతిధిగా విచ్చేసారు. ఎంపీ మాగంటి మురళీమోహన్, ఎం.ఎల్.సి.లు సోము వీర్రాజు, ఆదిరెడ్డి అప్పారావు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సారథ్య సంఘ అధ్యక్షులు డాక్టర్ కర్రి రామారెడ్డి దాదాపు 40నిమిషాలసేపు వైఎస్ జీవన రేఖలపేరిట రూపొందించిన మల్టీమీడియా ప్రదర్శన ఇచ్చారు.
తనకన్నా పెద్దవాళ్లకు సత్కారం
[మార్చు]ఇక ఈ వేడుకలో తనకన్నా పెద్దవాళ్ళైనా మాజీ ఎం.ఎల్.ఏ. చిట్టూరి ప్రభాకరచౌదరి (95 సంలు), స్వాతంత్ర్య సమర యోధులు ముళ్ళపూడి సూర్యనారాయణ (93 సంలు, వైద్యులు డాక్టర్ పెద్దింటి సీతారామ భార్గవ (92 సంలు, విద్యావేత్త ఆచార్య జోస్యుల సూర్య ప్రకాశరావు (89 సంలు), సీనియర్ న్యాయవాది పోతుకూచి సూర్యనారాయణ మూర్తి (87 సంలు, నాణాల సేకరణ కర్త పేరిచర్ల సూర్యనారాయణరాజు (84 సంలు), ఆడిటర్ ద్రోణంరాజు సుందర రామారావు (81సంలు) లను వై.ఎస్.ఎన్. సత్కరించారు. యాతగిరి రవితేజ సహకరించారు.
ప్రత్యేక సంచిక ఆవిష్కరణ
[మార్చు]తెలుగు వెలుగు డాక్టర్ అరిపిరాల నారాయణరావు సంపాదకత్వంలో వైఎస్ నరసింహారావు పై రూపొందించిన ప్రత్యేక సంచికను ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్; వైఎస్ రచించిన నృసింహ ప్రశ్నఉపనిషత్ తృతీయ ముద్రణను మాజీ ఎం.పీ. ఉండవల్లి అరుణకుమార్, స్వాతంత్ర్య సమరంలో వీరవనితలు పుస్తకాన్ని మాజీ ఎం.ఎల్.సి. కందుల దుర్గేష్ ఆవిష్కరించారు. వైఎస్ నరసింహారావు గురించి డాక్టర్ అరిపిరాల నారాయణరావు రచించిన ఎదురీత పుస్తకాన్ని అశీతి ఉత్సవ సారథ్య సంఘ గౌరవ అధ్యక్షులు పురప్రముఖులు డి బి వేంకటపతి రాజు, ఆవిష్కరించారు. ఇన్ కంటాక్స్ ప్రిన్సిపాల్ కమీషనర్ మేడిశెట్టి తిరుమల కుమార్ ఇన్ కం టాక్స్ ప్రిన్సిపాల్ కమీషనర్ జి.వి.గోపాలరావు, సుప్రసిద్ధ సాహితీవేత్త రాపాక ఏకాంబరాచార్యులు, మాజీ ఎం.ఎల్.సి. కందుల దుర్గేష్, సారథ్య సంఘం గౌరవ మహామహోపాధ్యాయ విశ్వనాధ గోపాలకృష్ణ శాస్త్రి, భారత భారతి ఆచార్య శలాక రఘునాధ శర్మ, ఆంధ్రకేసరి యువజన సమితి అధ్యక్షురాలు కోసూరి చండీప్రియ, సారథ్య సంఘ కోశాధికారి పొలసానపల్లి జగ్గారావు, ఆతిధ్య సంఘ సభ్యులు- కార్పొరేటర్ మాటూరి రంగారావు, కార్పొరేటర్ కొమ్మా శ్రీనివాసరావు, ప్రకాశం జాతీయ పరిషత్ కార్యదర్శి భయపుర్నేని సూర్యనారాయణ వేదికపై ఆశీనులయ్యారు.ఆంధ్రకేసరి సంస్థల సభ్యులు, ప్రముఖులు, వై.ఎస్.ఎన్. కుటుంబ సభ్యులు, బంధువులు, ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నరసింహారావుని పలువురు ఘనంగా సత్కరించారు.
వృద్ధాప్యం కారణంగా వైఎస్ నరసింహారావు కొన్నాళ్ళు ధవళేశ్వరం, మరికొన్నాళ్లు కృష్ణా జిల్లాలో ఉన్నప్పటికీ ఊరిమీద మమకారంతో రాజమండ్రి వచ్చేసారు. 17- 05- 2022లో మరణించారు.
మూలాలు
[మార్చు]1. ఆగస్టు 2014న ముద్రితమైన"నరసింహావలోకనం" (స్వీయచరిత్ర), 2. "నృసింహ ప్రశ్నోపనిషత్"2007, 2012,2016 3.గోదావరి సాక్షి.కాం నుండి Archived 2019-04-26 at the Wayback Machine 4. సరికొత్తసమాచారం పత్రిక
ఇతర లింకులు
[మార్చు],